దహెగాం, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని పీకలగుండం గ్రామస్తులు మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నెల రోజుల కింద పెద్దవాగు వరదల కారణంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ కొట్టుకుపోయి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సమీపంలోని ఎర్రవాగు చెలిమె నీళ్లే దిక్కయ్యాయి. కానీ వారం రోజులుగా పడుతున్న వర్షాలతో ఎర్రవాగు ఉధృతంగా పారుతోంది. అయినా మంచినీరు కావాలంటే ఈ వాగును దాటక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దీంతో పీకల్లోతు వరదను దాటుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లి మంచినీళ్లు తీసుకొని మళ్లీ అదే వరదలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గ్రామానికి చేరుతున్నారు. నీళ్లు తీసుకొచ్చే క్రమంలో వరద పెరిగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడింది. ఆఫీసర్లు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.