పదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పట్టిపీడించింది : డిప్యూటీ సీఎం

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు పట్టిపీడించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో  ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అన్నారాయన. పెద్దపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పారిశ్రామిక, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఉపముఖ్యమంత్రి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రగతి సభ నిర్వహించారు. స్థానిక నాయకులు, పెద్దపల్లి జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు సభలో పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రజల అవసరనికే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ ఒక్కరోజే (సెప్టెంబర్ 14) 5 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశాం. జీవో ఇచ్చాకే రూ.30 కోట్లతో పనులు ప్రారంభించాం. నియోజకవర్గం వ్యాప్తంగా రూ.85 కోట్లతో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టాము. రూ.11 వేల కోట్ల నిధులు పెద్దపల్లి జిల్లాకు కేటాయించామని తెలిపారు. 

మహిళాలకు సంవత్సరానికి  రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కాచాపూర్ లో  పైలెట్ ప్రాజెక్ట్ గా మహిళాలతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్.. ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛ ఆ అంశాన్ని బడ్జెట్ లో పెట్టామని త్వరలో నిధులు మంజూరు చేస్తామని విక్రమార్క అన్నారు. 

 రైతు రుణ మాఫీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అర్హులైన రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఎంపీ తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజల్ని మోసం చేసిందని పెద్దపల్లి ఎంపీ మండిపడ్డారు.

also read : ఫిరాయింపుల్లో బీఆర్ఎస్‌కు డాక్టరేట్: మంత్రి పొన్నం