పెద్దపల్లి, వెలుగు: వరదల్లో చిక్కుకుని చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, కునారంలో ఇటీవల నీటిలో మునిగి చనిపోయిన చెప్యాల పవన్, గోస్కుల కుమార్ కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి వంశీకృష్ణ మృతుల కుటుంబాలకు మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. వరద ప్రమాదంలో కుమార్, పవన్ చనిపోవడం బాధాకరమని ఎంపీ అన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భారీ వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
విపత్తును బీఆర్ఎస్ రాజకీయంచేస్తున్నది: ఎమ్మెల్యే విజయరమణారావు
వరద విపత్తును బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారును బద్నాం చేసేలా బీఆర్ఎస్ నాయకులు ప్రకటనలు చేయడం దుర్మార్గం అన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల చొప్పున అందజేశామని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు గోపగాని సారయ్య, గాజనవేన సదయ్య, ప్రకాశరావు, కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ గర్రెపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.