యువతకు ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తా: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా: యువతకు ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. యువత దేశంలో అత్యధికంగా ఉందని, యువత అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని చిన్న మున్షీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంపీ వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జెండా ఆవిష్కరించడం, స్కూల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.

దేశంలో చాలా అన్యాయాలు, హత్యలు జరుగుతున్నాయని.. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు  భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజెపీ ప్రభుత్వం పాలన చేస్తుందని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్టి కట్టివేసినట్లు బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో బీజెపీ ప్రభుత్వం సొంత ఎజెండాతో ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేదని కలకత్తా ఘటన చూస్తే తెలుస్తుందని, బీజెపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని ఆయన పిలుపునిచ్చారు.