సత్యనారాయణ టెంపుల్ అభివృద్ధికి ఎంపీ నిధులిస్తా : ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాలలోని గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి తన వంతు సహకారం అందిస్తానన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  దండపల్లి మండలం గూడెం రమాసత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు ఎంపీ వంశీ కృష్ణ.  ఆలయ అర్చకులు,అధికారులు  పూర్ణకుంభ స్వాగతం పలికారు.  శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.  

ఈ సందర్బంగా మాట్లాడిన వంశీకృష్ణ.. మొట్టమొదటిసారిగా గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం  అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.  1964 లో స్వయంభు వెలసిన స్వామి వారి ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం గొప్ప విషయమన్నారు.  కోరిన కోరికలు తీర్చే దేవుడిగా సత్యనారాయణ స్వామి విరజిల్లుతున్నారని చెప్పారు.  ఈ ఆలయం ఇంకా అభివృద్ధి కావాల్సి ఉందని..  అభివృద్ధి కోసం తన  ఎంపీ నిధుల నుంచి తన  వంతు సహకారం అందిస్తానన్నారు.

తెలంగాణలో మరో అన్నవరంగా పిలవబడుతున్న గూడెం సత్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.  సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు వంశీకృష్ణ.