పెద్దపల్లిలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ కు ఎంపీ వంశీకృష్ణ వినతి

కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిశారు. రామగుండం-పెద్దపల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని నవంబర్ 28 ( గురువారం) కేంద్రమంత్రిని ఎంపీ వంశీకృష్ణ కోరారు. విజ్ఞప్తిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. పెద్దపల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో 20 లక్షలమంది పెద్దపల్లి ప్రాంతావాసులకే కాకుండా ఆదిలాబాద్, ఇతర ప్రాంతలవారికి కూడా ఉపయోగపడుతుందని ఎంపీ వంశీ కృష్ణ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 

పెద్దపల్లి, రామగుండం ప్రాంతంలో ఇండస్ట్రీయల్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుందని వివరించారు. ఇప్పటికే వరంగల్ కు ఏయిర్ పోర్ట్ మంజూరైంది. ఇక ఉత్తర తెలంగాణ కేంద్రంగా పెద్దపల్లిలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం వారికి సుదూర ప్రయాణాలు సులభం అవుతాయి. సింగరేణి బొగ్గు పరిశ్రమకు కూడా ఇది ఏంతో తోడ్పాటు ఇస్తుంది. అంతే కాదు.. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ఏరియాకు రోడ్డు ప్రయాణం చాలా కష్టం.. కాబట్టి పెద్దపల్లిలో విమానాశ్రమం ఏర్పాటు చేస్తే అన్ని విధాల బాగుంటుందని ఎంపీ వివరించారు.