బాబోయ్ ఫీజులు..ఇష్టారీతినా స్కూల్ ఫీజుల పెంపు

  •     అమలుకు కానీ ప్రభుత్వ నిబంధనలు
  •     అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే

సిద్దిపేట, వెలుగు : పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు ఫీజుల భారాన్ని మోయలేకపోతున్నారు. వారి ఆశను క్యాష్​చేసుకొని కార్పొరేట్​స్కూళ్లు అంతకంతకు ఫీజులు పెంచుతున్నారు. అధికారులు మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏట నిబంధనల ప్రకారం పది శాతం మేర ఫీజులు పెంచాల్సి ఉన్నా  ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. నర్సరీ నుంచి హైస్కూల్ వరకు వేల రూపాయల ఫీజుతో పాటు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజుల పేరిట అదనంగా దండుకుంటున్నారు.

వీటితో పాటు  బుక్స్, ట్రాన్స్ పోర్ట్, డ్రెస్​ల పేరిట అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 260 ప్రైవేటు స్కూళ్లు ఉండగా జిల్లా కేంద్రంలో 60 వరకు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లతో పాటు డజను కార్పొరేట్ స్కూళ్లు జిల్లా కేంద్రంలో ఇష్టారీతిగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. నర్సరీ స్టూడెంట్​కు ఏటా దాదాపు 50 వేలు, హైస్కూల్ స్టూడెంట్​కు లక్ష రూపాయలకు పైగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితులు కల్పించారు. 

అమలు కాని నిబంధనలు

ప్రైవేటు స్కూళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం పేద పిల్లలకు అడ్మిషన్లు కల్పించాల్సి ఉన్నా ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఫీజుల నియంత్రణ కోసం 2019 లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ప్రతి ఏటా పది శాతం మేర ఫీజులు పెంచుకోవచ్చని సూచించిగా 2020 లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు జరగడం లేదు.  ప్రైవేటు స్కూల్స్ టెక్స్ట్, నోట్ బుక్కుల అమ్మకాల పేరిట చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు.

హై కోర్టు ఆదేశాల పేరిట స్కూళ్లకు సమీపంలో టెక్స్ట్, నోట్ బుక్కుల విక్రయానికి ప్రైవేటు స్కూళ్లు తెరలేపాయి. స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ తమ వద్దనే బుక్స్ కొనుగోలు చేయాలనే నిబంధన పెడుతున్నారు. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు బుక్స్ కోసం దాదాపు ఆరు వేలు వెచ్చించాల్సి వస్తుండగా హైస్కూల్ స్టూడెంట్స్​కోసం పది వేలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

తూతూ మంత్రంగా చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు స్కూళ్లపై అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. ఫీజులు, బుక్స్ అమ్మకాలపై స్టూడెంట్స్​ సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేస్తే అధికారులు నామా మాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పలు సందర్భల్లో బుక్స్ అమ్ముతున్న రూమ్ లను సీజ్ చేసినా మరునాడే యథావిథిగా అమ్మకాలు జరుపుతున్నారు. 

ఫీజుల పెంపును నియంత్రించాలి

ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలి. ఈ విషయంలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరిస్తే ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంతో పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నారు. ఫీజుల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 

శ్రీకాంత్, పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రైవేట్ దోపిడీని అరికట్టాలి

ఫీజులు, బుక్స్ అమ్మకాల పేరిట ఇష్టారీతిగా చేస్తున్న దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంతో పేద విద్యార్థులు,  ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో సౌకర్యాలు సైతం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈ విషయాన్ని అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలి.

- వివేక్ వర్ధన్, ఏబీవీపీ జిల్లా కార్యదర్శి