మందకృష్ణ నోరు అదుపులో పెట్టుకో : పసుల రామ్మూర్తి

  • మాలల కోసం పాటుపడే వివేక్ వెంకటస్వామిపై నోరు జారితే తీవ్ర పరిణామాలు
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి హెచ్చరిక

కాగ జ్ నగర్/ తాండూరు, వెలుగు : మాలల సంక్షేమానికి పాటుపడుతున్న కాకా కుటుంబానికి జాతి రుణపడి ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు  మందకృష్ణ మాదిగ నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగ జ్ నగర్ లోని అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుండ్ర శ్రీనివాస్ తో కలిసి మాట్లాడారు. 

మాలలను ఏకం చేస్తూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేస్తున్న కృషిని ఓర్వలేక మందకృష్ణ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించే మాల సింహగర్జనకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. మాలల ఆత్మగౌరవం, ఐక్యతను చాటేలా 30 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోగాల కిష్టయ్య, బెల్లంపల్లి అసెంబ్లీ ఇన్​చార్జి ఎరుకల శ్రీనివాస్ ఉన్నారు. 

ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని పసుల రాంమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం తాండూరు మండల కేంద్రంలో హలో మాల చలో హైదరాబాద్ సింహగర్జన పోస్టర్లను ఆయన నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మాలల ఐక్యత కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మందకృష్ణ మాదిగ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.