ఆసిఫాబాద్ లో ఓటరు జాబితా తయారీకి పార్టీలు సహకరించాలి

ఆసిఫాబాద్, వెలుగు: పొరపాట్లకు తావులేకుండా పక్కాగా ఓటరు జాబితా రూపొందించడంలో అధికారులకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆసిఫాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే కోరారు.  ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2025లో భాగంగా ఇంటింటా సర్వేపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీఓ లోకేశ్వర్ రావుతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి అధికారులు కొనసాగిస్తున్న ఇంటింటి ఓటర్ల సర్వే 59 శాతం పూర్తయిందని తెలిపారు.

ఈనెల 20వ తేదీలోగా సర్వేను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఒకే కుటుంబంలోని ఓటర్లను ఇంటి నంబరు ప్రకారం ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాబితా రూపొందిస్తామన్నారు. బూత్ స్థాయి అధికారులు యాప్ ద్వారా వివరాలు పొందుపరుస్తున్నారని, వివరాల నమోదులో సహకరించాలని కోరారు.