ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో టీచర్లను నియమించాలి .. ప్రధాన రహదారిపై తల్లిదండ్రుల ధర్నా

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో ఇద్దరు టీచర్లను నియమించాలని, పాఠశాల ఆవరణను శుభ్రం చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇద్దరు టీచర్లతో పాఠశాల సక్రమంగా నడిచేదని, ఇటీవల ఒకరిని బదిలీ చేయడంతో ఉన్న ఒక్క టీచర్ సమయానికి రావడంలేదన్నారు.

స్కూల్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి బడిలోకి పాములు వస్తున్నాయని, తాగునీటి సౌకర్యం లేక తమ పిల్లలు అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఏంఈవో షేక్ హుస్సేన్ అక్కడికి చేరుకుని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.