- కమలాయపల్లిలో పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ
చేర్యాల, వెలుగు: రాజ్యాంగం భద్రంగా ఉంటేనే ప్రజలకు అన్ని హక్కులు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. ఎన్విరాన్‌మెంటల్ ప్రాజెక్ట్, బయోడీజిల్డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కమలాయపల్లిలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు, సావిత్రీబాయిపూలే విగ్రహాలను గురువారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ పూలే దంపతుల చరిత్రను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.
అంటరానితనం, కులవివక్షత గురించి పోరాటాలు చేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చదువు అనేది తరిగిపోని ఆస్తి అని, యువత బాగా చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ వస్తే అందరూ బాగుపడుతారని అనుకుంటే బీఆర్‌ఎస్ హయాంలో అది సాధ్యం కాలేదన్నారు. ఈ ప్రాంతానికి నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
కమలాయపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగపురి రాజలింగం, సిద్దిపేట జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్‌రెడ్డి, ఎంపీటీసీ కమలాకర్ యాదవ్, రవి, చిరంజీవులు పాల్గొన్నారు.