ఇంద్రవెల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత : ఆందోళనకు దిగిన స్థానికులు

గుడిహత్నూర్‌, వెలుగు: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డు ఎదురుగా ఉన్న నాలాపై అనుమతుల్లేకుండా  నిర్మించిన వాటిని జిల్లా పంచాయతీ, గ్రామ పంచాయితీ అధికారులు శనివారం కూల్చివేశారు. అనంతరం ప్రధాన రహదారిని ఆనుకొని నిర్మిస్తున్న ఓ భవనం పిల్లర్లను సైతం కూల్చివేశారు.

ఈ కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ గుడిహత్నూర్‌–ఉట్నూర్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. దుకాణాలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ చేపట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఇంద్రవెల్లికి చేరుకున్న సబ్‌ కలెక్టర్​తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ అక్రమ కట్టడాలకు సంబంధించి ముందస్తు నోటీసులు ఇచ్చామని, స్పందించకపోవడంతో కూల్చివేస్తున్నామని వెల్లడించారు.

అనుమతి లేకుండా నిర్మిస్తే చర్యలు: కలెక్టర్‌ రాజర్షి షా

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడితే ఉపేక్షించేది లేదని కలె క్టర్‌ రాజర్షి షా హెచ్చరించారు. ఇంద్రవెల్లిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు పరిశీలించి అక్రమ కట్టడాలుగా తేల్చిన తర్వాతే నోటీసులు ఇచ్చి కూల్చివేశామని తెలిపారు.