పోరాటాలతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం

  • మందమర్రిలో సీపీఎం జిల్లా మహా సభలు 

కోల్ బెల్ట్, వెలుగు: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీ(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ అన్నారు. మందమర్రి పట్టణంలోని శ్రీకృష్ణ గార్డెన్స్ లో శుక్రవారం జిల్లా మూడో మహా సభలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గోమాస ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పాలడుగు భాస్కర్ హాజరై మాట్లాడారు. మంచిర్యాల జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించే అవకాశం మెండుగా ఉన్నా ఎనుకబడిపోయిందన్నారు. పర్యాటక ప్రాంతాలు, అటవీ సంపద, ప్రాణహిత, కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా జిల్లాకు చుక్క నీరు అందడం లేదన్నారు. 

తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించకపోవడంతో సాగు, తాగు నీరు అందకుండాపోయిందని అన్నారు. సరైన ప్రభుత్వ వైద్యం అందక బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులను అశ్రమించి దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) అధ్వర్యంలో  జరిగే పోరాటాలలకు జిల్లా ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.