పద్మశ్రీ అవార్డు గ్రహీత.. గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు కన్నుమూత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన  పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 25న కన్నుమూశారు. అక్టోబర్ 26న  మధ్యాహ్నం స్వగ్రామంలో ఆదివాసి సాంప్రదాయం ప్రకారం ఆయన  అంత్యక్రియలు నిర్వహించనున్నారు  కుటుంబ సభ్యులు.

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు.. ఆదివాసీ సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు. 55 సంవత్సరాలుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆసక్తి చూపే వారికి శిక్షణ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ..  నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కనకరాజుకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 2021 నవంబరు 9న అవార్డును ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం.

 కనకరాజు నిరుపేద.  ఆయనకు ఇద్దరు భార్యలు, 12 మంది సంతానం. కనకరాజు మార్లవాయిలోని ఐటీడీఏ ఆశ్రమ స్కూల్​లో డైలీ వేజ్​వర్కర్​గా పని చేస్తూనే గుస్సాడీ డ్యాన్సులు చేసేవారు. 3, 4 నెలలకు ఒకసారి వచ్చే వేతనంతోనే ఆయన కుటుంబం గడిచేది.  పద్మశ్రీ అవార్డ్ గ్రహీతతో స్కూల్ డ్యూటీ చేయించకూడదని ఐటీడీఏ ఆఫీసర్లు నిర్ణయించారు. దాంతో కనకరాజుకు ఉపాధి కూడా దూరమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన టీబీ బారిన పడ్డారు.