కుళ్లిన మటన్.. బూజు పట్టిన కూరగాయలు : ఆదిలాబాద్‌లో హోటల్స్, రెస్టారెంట్స్ పై దాడులు

ఆదిలాబాద్​టైన్, వెలుగు:  ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ హౌస్ లపై ఆదివారం రాష్ట్ర ఫుడ్  సేఫ్టీ టీమ్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. దీంతో  కుళ్లిన మటన్ .. బూజు పట్టిన కూరగాయలతో పాటు,ఇతర వంట సామగ్రి వస్తువులు వంటకాలు బయటపడ్డాయి. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్  ఆదేశాల మేరకు ఆదివారం ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ రోహిత్ రెడ్డి ,పి.స్వాతి, శ్రీషిక టీమ్ దాడులు చేసింది. 

ఆదిలాబాద్ టౌన్ లోని   లక్ష్మీనరసింహస్వామి ఫ్యామిలీ రెస్టారెంట్(నాయుడు గారి కుండ బిర్యాని), ఢిల్లీవాలా స్వీట్ హౌస్, వెంకటేశ్వర స్వీట్ హౌస్, లోటస్ గ్రాండ్ ఫ్యామిలీ  రెస్టారెంట్ల లో తనిఖీలు నిర్వహించారు.  నాయుడు గారి కుండ బిర్యాని  రెస్టారెంట్ లో రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల అనుగుణంగా టెంపరేచర్ మెంటైన్ చేయకపోవడం, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో 30 కిలోలు రూ. 15 వేల విలువైన కుళ్లిన మటన్, ఉత్పత్తులను నిలువ చేసి, హానికరమైన కలర్స్ కలిపిన చికెన్, చేపలు, లేబుల్లేకుండా ఉన్న పన్నీరు, మసాలాలు, బూజు పట్టిన కూరగాయలను గుర్తించారు. లోటస్ రెస్టారెంట్ ఫ్రిజ్ లో  వాసన పట్టిన మటన్, 30 కిలోల గ్రేవీ, కాలంచెల్లిన వనస్పతి ఆయిల్,  బూజు పట్టిన కూరగాయలను  ధ్వంసం చేశారు. వినాయక చౌక్ ఢిల్లీ వాలా స్వీట్ హౌస్, శ్రీ వెంకటేశ్వర స్వీట్ హౌస్ లో  అనుమానిత  శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కి తరలించారు.  

సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చారు. మరిగించిన నూనెను, పురుగులు పట్టి దుర్వాసనతో ఉన్న పప్పులను, సమోసాల ఆలు కుర్మాను ధ్వంసం చేశారు. రెస్టారెంట్లు నాణ్యతాప్రమాణాలు పాటించకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. అధికారుల దాడులతో జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.