రూ.39 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీ.. బ్యాటరీని ఇంట్లో ఇన్వర్టర్లా కూడా వాడుకోవచ్చు..!

ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. గిగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటీలను అతి తక్కువ ధరకే మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రూ.39 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీని కొనుక్కుని ఎంచక్కా ఎంజాయ్ చేయండని ప్రకటించారు. ఓలా ఎస్1 జెడ్, గిగ్ రేంజ్ స్కూటీ మోడల్స్ రిజర్వేషన్స్ ఓపెన్ చేసినట్లు ఓలా సీఈవో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్ స్కూటీలను బుక్ చేసుకునేందుకు లింక్స్ షేర్ చేశారు. ఏప్రిల్ 25 నుంచి డెలివరీస్ ఉంటాయని తెలిపారు.

పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్తో పాటు ఓలా పవర్ ప్యాడ్ను వినియోగించుకుని ఇంట్లో ఇన్వర్టర్లా కూడా వాడుకోవచ్చని పోస్ట్లో తెలిపారు. 1.5 kWh బ్యాటరీ సామర్థ్యంతో ఉండే ఓలా పవర్ ప్యాడ్ ఒక పోర్టబుల్ ఇన్వర్టర్. 500W వరకూ ఔట్పుట్ వస్తుందని, ఈ పవర్ సాయంతో ఎల్ఈడీ బల్బులు, సీలింగ్ ఫ్యాన్స్, టీవీలు, మొబైల్ చార్జర్స్, వైఫై రూటర్లను 3 గంటల పాటు వినియోగించుకోవచ్చని ఓలా సీఈవో చెప్పారు. ఓలా పవర్ ప్యాడ్ ఖరీదు 9,999 రూపాయలు. 

ALSO READ | 2030-31 నాటికి 7.5 లక్షల కార్లు..ఎగుమతులపై మారుతి టార్గెట్​ ఇది

కరెంటు కోతలతో బాధపడే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలకు ఈ ఓలా పవర్ ప్యాడ్ ఒక పరిష్కారంగా కూడా పనికొస్తుందనే విజన్ తో ఈ ఓలా పవర్ ప్యాడ్ తీసుకొచ్చారు. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటీల వినియోగం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. మెట్రో సిటీల్లో అయితే ఈ స్కూటీలు తెగ కనిపిస్తున్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటీలు పేలిన ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటీల అమ్మకాలపై ఆ ప్రభావం పెద్దగా లేదు. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతుండటంతో కంపెనీలు కూడా సరికొత్త మోడల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.