- రైతు పేరు మీదకు ఇతరుల భూమి మార్చిన అధికారులు
- ఆ జాగా తనది కాదని తహసీల్దార్‌కు రైతు లెటర్
- ఎకరంతో పాటు అతడి భూమి కూడా మరొకరికి మార్పు
- సంగారెడ్డి జిల్లాలో ఐదేండ్ల నుంచి తిరుగుతున్న రైతు
సంగారెడ్డి, వెలుగు : తనది కాని భూమిని వద్దనుకుని మంచితనం చాటిన ఓ రైతు..అధికారుల నిర్లక్ష్యం, ధరణి సమస్య వల్ల అతడి భూమిని కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో ఐదున్నరేండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్కు చెందిన రైతు మాడెప్పకు 4.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2018లో ధరణి పోర్టల్ లో సాంకేతిక సమస్యల కారణంగా ఇతరుల కు చెందిన ఎకరా భూమి మాడెప్ప పేరు మీద పడింది. ఆ భూమి తనది కాదని..ఎవరిదో గుర్తించి మార్చాలని మాడెప్ప నిజాయతీగా మునిపల్లి తహసీల్దార్‌కు అప్పట్లోనే నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చాడు.
అయితే, ఇక్కడే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మాడెప్ప కొంప ముంచింది. అదనంగా వచ్చిన ఎకరాను వేరే వాళ్లకు బదిలీ చేయడంతో పాటు మాడెప్ప పేరుపై ఉన్న 4.35 ఎకరాల భూమిని కూడా ఇతరులకు మార్చారు. దీంతో మాడెప్ప అప్పటి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా పొరపాటు జరిగిందని అంగీకరించి త్వరలోనే మాడెప్ప పేరుమీదకు మారుతుందని సర్దిచెప్పి పంపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే దాదాపు ఐదున్నరేండ్లుగా సీసీఎల్ఏ, కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. సంగారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు మాడెప్ప ఎప్పటిలాగే వచ్చి కలెక్టర్ క్రాంతి వల్లూరుకు సమస్యను విన్నవించుకొని వినతి పత్రం ఇచ్చి వెళ్లాడు.
సీఎం స్పందించాలి
ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది కష్టాల పాలయ్యారు. రైతులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. మంచి చేయబోతే పాపం చుట్టుకున్నట్టయింది నా పరిస్థితి. ఐదున్నరేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు. నా భూమి నా పేరు మీదకు మార్చడానికి సమస్య ఏంటో అర్థమైతలేదు. ధరణి సమస్యలపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నాకు రావాల్సిన 4.35 ఎకరాల భూమిని నా పేరు మీదకు మార్చేలా అధికారులకు ఆదేశాలివ్వాలి. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడమే దిక్కు.
- మాడెప్ప బాధిత రైతు