- హాజరుకానున్న 37,930 మంది అభ్యర్థులు
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆది, సోమవారాల్లో పరీక్ష జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆపీసర్లతో ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు పరీక్ష నిర్వహణపై సూచనలు చేశారు. ఆదివారం మొదటి రోజు పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, సోమవారం పేపర్ 3 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 4 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగనున్నాయి.
ఉదయం జరిగే పరీక్షకు 8.30 గంటలకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 37, 930 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్య అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్సెంటర్లోకి అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. సెంటర్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేంద్రాల్లో టాయిలెట్స్, తాగునీరు, తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ముగిసేంతవరకు జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలని, ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో డీఏస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో పాటు పోలీసు బలగాలతో బందోబస్తు, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష వివరాలు
జిల్లా పరీక్ష కేంద్రాలు అభ్యర్థులు
ఆదిలాబాద్ 29 10,428
మంచిర్యాల 48 14,951
నిర్మల్ 24 8080
ఆసిఫాబాద్ 18 4,471
మొత్తం 119 37,930