సమయపాలన పాటించరు .. మారని ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల తీరు

మారని బెల్లంపల్లి ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల తీరు

బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది స్థానికంగా హెడ్ క్వార్టర్​లోనే ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయినా రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బెల్లంపల్లిలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండడం లేదు. ప్రధానంగా ఆర్డీవో ఆఫీస్ లో పనిచేసే డీఏవోతో పాటు డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్​ అసిస్టెంట్లు, టైపిస్టులు, డీఐలతో పాటు మరికొంత మంది సిబ్బంది స్థానికంగా ఉండకుండా మంచిర్యాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 

మున్సిపల్, అటవీ, ఎక్సైజ్, విద్య శాఖ, వ్యవసాయశాఖల్లోనూ... 

రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బెల్లంపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం పలు చోట్ల నుంచి ప్రజలు వస్తారు. మున్సిపాలిటీలో ఫారెస్ట్, ఎక్సైజ్, కరెంట్, మెడికల్, ఇరిగేషన్, ఫైర్, విద్య, వ్యవసాయ శాఖలతో పాటు సబ్ ట్రైజరీ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు స్థానికంగా ఉండడం లేదు. ఇష్టారీతిన విధులకు హాజరవుతూ అందుబాటులో ఉండకపోవడంతో వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజల పనులు పెండింగ్​లో ఉంటున్నాయి. ఉదయం 10 గంటల వరకే ఆఫీస్​లకు చేరుకోవాల్సిన అధికా రులు.. 11 గంటలు దాటినా విధులకు హాజరుకావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, అధికారులు స్థానికంగా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

స్థానికంగా ఉండనివారిపై చర్యలు తప్పవు

బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది స్థానికంగానే ఉండి ప్రజలకు సేవలందించాలి. స్థానికంగా ఉండని వారిపై ప్రజలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా. ఫీల్డ్ వెళ్లేవారు తప్ప ప్రతి ఒక్కరూ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి. లేకపోతే యాక్షన్ తప్పదు.

కుమార్ దీపక్, కలెక్టర్, మంచిర్యాల