కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు యాజమాన్యం క్వాలిటీ పనిముట్లు అందజేయాలని ఐఎన్టీయూసీ వైస్‌ప్రెసిడెంట్ దేవి భూమయ్య డిమాండ్‌చేశారు. శనివారం మందమర్రి ఏరియా కేకే-5 గనిలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ‘బాయిబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను యూనియన్ లీడర్లు కలిసి వారి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గనిలో నాణ్యత కలిగిన చటాయి సబ్బళ్లు, డ్రిల్బోల్టులు, సకాలంలో బూట్లు, గ్లౌజ్‌లు తదితర సేఫ్టీ పరికరాలు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులకు సులభతరమైన పనులను కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను గని సేఫ్టీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.