పరిహారం తేల్చకుండానే నోటీసులా ?..ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ బాధితుల ఆగ్రహం

  •     మొదటి విడతలో భువనగిరి నుంచి సంగారెడ్డి వరకు 158 కిలోమీటర్ల మేర ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌
  •     భూమికి భూమి, లేదంటే ఎకరాకు రూ.కోటి ఇవ్వాలంటున్న రైతులు
  •     కొలిక్కిరాని పరిహారం, విడుదల కాని ఫండ్స్‌‌‌‌‌‌‌‌
  •     నోటీసులతో ఆందోళనకు గురవుతున్న రైతులు

సంగారెడ్డి, వెలుగు : రీజినల్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్) నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని రైతులకు నోటీసులు అందుతున్నాయి. అయితే పరిహారం ఎంతిస్తారో నిర్ణయించకుండా భూములు ఇవ్వాలని నోటీసులు ఇవ్వడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కొలిక్కి రాకపోవడంతో తుది ప్రయత్నానికి రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. తెలంగాణ ఉత్తర భాగమైన యాదాద్రి- భువనగిరి నుంచి మొదలుకొని సిద్దిపేట, మెదక్‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి జిల్లాల మీదుగా మొదటి విడతలో 158 కిలోమీటర్ల పొడవునా ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ చుట్టూ రీజినల్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో నిర్మించనున్న 158 కిలో మీటర్ల ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌లో 105 కిలోమీటర్లు ఉమ్మడి మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోనే నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం ఆయా జిల్లాల పరిధిలో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఆదేశించింది.

కానీ అందుకు అవసరమైన ఫండ్స్‌‌‌‌‌‌‌‌ విడుదల చేయకపోవడం, భూములకు ప్రాంతాలను బట్టి ధర నిర్ణయించకపోవడం వల్ల ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఫండ్స్ రాకపోయినా, భూసేకరణకు ధర నిర్ణయించకపోయినా మొదటి దఫాలో పూర్తి చేయాల్సిన భూముల గుర్తింపులో అధికారులు స్పీడ్ పెంచి పట్టా పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ జీరాక్స్‌‌‌‌‌‌‌‌ కాపీలను తీసుకొని నోటీసులు ఇస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో పిలిచి నోటీసులు ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 3,429 ఎకరాల సేకరణ

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 63 గ్రామాల మీదుగా రీజినల్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణం జరుగనుంది. 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు, నాలుగు చోట్ల భారీ జంక్షన్లు నిర్మించనుండగా, ఇందుకుగాను మూడు జిల్లాల పరిధిలో 3,429 ఎకరాల భూ సేకరణ చేపట్టేందుకు నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లాలో 1,199 మంది రైతుల నుంచి 659.30 ఎకరాలు సేకరిస్తున్న అధికారులు, ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇవ్వగా, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేస్తున్నారు. మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నర్సాపూర్, శివ్వంపేట, మాసాయిపేట, తూప్రాన్‌‌‌‌‌‌‌‌ నాలుగు మండలాల పరిధిలో దాదాపు 800 మంది రైతుల నుంచి 1,149 ఎకరాలు సేకరించేందుకు గుర్తించారు.

సిద్దిపేట జిల్లాలో 1,168 మంది రైతుల నుంచి 962.27 ఎకరాలను సేకరించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సంగారెడ్డి సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లోని సంగారెడ్డి, సదాశివపేట, మండలాలు, ఆంధోల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని చౌటకూర్, పుల్కల్‌‌‌‌‌‌‌‌ మండలాలు, మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా నర్సాపూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం హత్నూర, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్, వర్గల్, గజ్వేల్, జగదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, రాయపోల్‌‌‌‌‌‌‌‌ మండలాల మీదుగా రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. అలాగే యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భువనగిరి, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, ఎల్కపల్లి మూడు పార్టులుగా విభజించి 25 గ్రామాల మీదుగా రింగ్‌‌‌‌‌‌‌‌రోడ్డు వెళ్తోంది. మొత్తం 59 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్ కోసం 1,742 ఎకరాలు తీసుకోనున్నారు. అయితే ఇందులో రాయగిరి జంక్షన్‌‌‌‌‌‌‌‌ భూసేకరణ ఇష్యూపై కోర్టు స్టే కొనసాగుతోంది. ఇక్కడి రైతులకు ఇప్పటికే మూడు విడతల నోటీసులు అందాయి. 

కొలిక్కిరాని పరిహారం

భూసేకరణ కోసం భూమిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రస్తుత ధర ఆధారంగా ప్రభుత్వం పరిహారం చెల్లించనున్నట్లు తెలిసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న రైతులు భూమికి భూమి లేదంటే ఎకరాకు రూ. కోటి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. భూమిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఎకరా భూమి రూ. కోటి పలుకుతోంది. ప్రభుత్వం చెల్లిస్తామన్న పరిహారం లక్షల్లోనే ఉంటుండడంతో రైతులు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. మండలాల వారీగా ఆర్డీవోలు, తహసీల్దార్ల సమక్షంలో చేపడుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం కొలిక్కి రాకపోవడంతో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.

చివరి ప్రయత్నంగా మూడో విడత ప్రజాభిప్రాయ సేకరణకు రెవెన్యూ ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం ఫండ్స్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో పరిహారంపై జిల్లా యంత్రాంగం కూడా నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఫండ్స్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేస్తే పరిహారం విషయం తేల్చి భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రీజనల్ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చొరవ చూపుతున్నందున త్వరలోనే భూసేకరణ ప్రక్రియ తుది దశకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.