ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజున మూల విరాట్ పి ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం అని నమ్ముతారు. ఈ రోజు తప్ప మిగతా రోజుల్లో ఉత్తర ద్వార దర్శనం ఉండదు. అందుకని ముక్కోటి ఏకాదశి నాడు ఆలయాలకు ఎక్కువ మంది వెళ్తారు. కానీ, మెదక్ జిల్లా నిజాంపేటలోని చల్మెడ దగ్గర కొలువైన తిరుమలయ్య గుడి మాత్రం చాలా స్పెషల్. ఈ గుడి ప్రధాన ద్వారమే ఉత్తరానికి ఉంటుంది. అంటే ఎప్పుడూ ఇక్కడ ఉత్తరద్వార దర్శనమే.
చల్మెడ గ్రామంలో సుమారు 800 ఏండ్ల క్రితం తిరుమలనాథుడు (వేంకటేశ్వరస్వామి) స్వయంభుగా వెలిశాడని ఇక్కడివాళ్లు చెప్తారు. కాకతీయుల కాలంలోనే (13వ శతాబ్దం) ఈ గుడి కట్టారు. మామూలుగా అయితే దేవాలయాలకు తూర్పు, పడమరల్లో ప్రధాన ద్వారం పెడతారు. ఉత్తర ద్వారం ఉన్నా, వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు. చల్మెడలో మాత్రం ప్రధాన ద్వారం ఉత్తరదిక్కులోనే పెట్టారు. ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆలయ ఆవరణలో ఉన్న గుండంలో పవిత్ర స్నానాలుచేసి తిరుమలనాథుడిని దర్శించుకుంటారు. చల్మెడ తిరుమలనాథ స్వామిని కోరిన కోర్కెలు తీర్చే దేవుడుగా భక్తులు నమ్ముతారు. మొక్కులు చెల్లించేవారు తమ పిల్లలకు తిరుమల స్వామి పేరు కలిసి వచ్చేలా తిరుమలయ్య, తిరుమలవ్వ అని పేర్లు పెట్టుకుంటారు.