తగ్గుతున్న బీమా చెల్లింపులు .. 2024 సంవత్సరంలో 82 శాతానికి డౌన్​

  • పెరిగిన ప్రీమియం వసూళ్లు
  • కంపెనీలకు లాభాల పంట
  • వెల్లడించిన ఐఆర్​డీఏ రిపోర్ట్​

న్యూఢిల్లీ: జీవిత బీమాయేతర  క్లెయిమ్‌​లకు కంపెనీలు చెల్లించే డబ్బు తగ్గుతోంది. 2023–24 సంవత్సరంలో కంపెనీలు 82.52 శాతం క్లెయిమ్స్​ను అంగీకరించగా, అంతకుముందు సంవత్సరంలో ఇది 82.92 శాతంగా ఉంది. అంటే.. నాన్–-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు సంపాదించిన ప్రీమియంలలో తక్కువ అమౌంట్‌నే  క్లెయిమ్‌‌‌‌‌‌‌‌లుగా చెల్లించాయని ఇన్సూరెన్స్​ రెగ్యులేటర్ ​ఐఆర్​డీఏ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం... 2023-–24 సంవత్సరంలో కంపెనీలు రూ.2.90 లక్షల కోట్ల విలువైన ప్రీమియాలను కంపెనీలు వసూలు​ చేశాయి. 

అంతకుముందు ఏడాది వసూళ్లతో పోలిస్తే ఇది 12.76 శాతం ఎక్కువ.  ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల కంట్రిబ్యూషన్​ 2022–-23లో రూ.82,891 కోట్ల నుంచి 2023–-24లో రూ.90,252 కోట్లకు .. అంటే 8.88 శాతం పెరిగింది.   స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలతో సహా ప్రైవేట్ రంగ బీమా సంస్థలు 2022-–23లో రూ. 1.58 లక్షల కోట్లు వసూలు చేయగా,  2023-–24లో రూ. 1.88 లక్షల కోట్లను వసూలు చేశాయి.   నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ రంగం మొత్తం లాభం రూ. 10,119 కోట్లుగా ఉండగా,  2022–-23లో రూ. 2,566 కోట్ల నికర నష్టం వచ్చింది.  2023-–24లో మొత్తం నికర క్లెయిమ్స్​ విలువ 15.39 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్ల నుంచి రూ.1.72 లక్షల కోట్లకు చేరింది.    ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత బాగా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌లను సెటిల్ చేస్తుందో తెలియజేసే ముఖ్యమైన సూచికే క్లెయిమ్ రేషియో.    

భారీగా ప్రభుత్వ బీమా కంపెనీల చెల్లింపులు

2023--–24లో పబ్లిక్​​ సెక్టార్​ జనరల్​ ఇన్సూరర్ల క్లెయిమ్​ రేషియో 97.23 శాతం ఉండగా, అంతకుముందు సంవత్సరంలో 99.02 శాతంగా నమోదయింది. ప్రైవేట్​ కంపెనీల విషయంలో ఇది 76.49 శాతమే ఉంది. 2023---–24లో జీవిత బీమా కంపెనీలు రూ.5.77 లక్షల కోట్ల విలువైన బెనిఫిట్స్​ను ఇచ్చాయి. నికర ప్రీమియంలో ఇది 70.22 శాతానికి సమానం. పాలసీల సరెండర్లు/విత్​డ్రాయర్ల కోసం జీవిత బీమా ఇండస్ట్రీ ఇదేకాలంలో చెల్లించిన మొత్తం వార్షికంగా 15.29 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరింది.

 ఈ విషయంలో పబ్లిక్​సెక్టార్​ కంపెనీల వాటా 58.36 శాతం ఉంది. 2023-–--24లో మొత్తం 18 జీవిత బీమా కంపెనీలు లాభాలను ప్రకటించాయి. ఇండస్ట్రీ లాభాలు వార్షికంగా 10.79 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరుకున్నాయి.2023–-24లో ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలు లాభాల్లో 11.75 శాతం వృద్ధిని సాధించగా, ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థలు 5.32 శాతం లాభాలను నమోదు చేశాయి