- పక్క ఊరు నుంచి తీసుకువచ్చిన కుటుంబీకులు
- రెండు ఫ్యామిలీల వారే పాడె మోసుకున్నరు
- సిద్దిపేట జిల్లా బొప్పాపూర్‌లో ఘటన
దుబ్బాక, వెలుగు : కుల బహిష్కరణకు గురైన దళిత కుటుంబంలోని మాజీ మావోయిస్టు ఒకరు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. కనీసం పాడె మోయడానికి కూడా కదలకపోవడంతో రెండు కుటుంబాల వారే ఆ పని చేసుకున్నారు. డప్పులు కొట్టేవాళ్లను కూడా వేరే గ్రామం నుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్భర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన బండమీది సాయిలు(71) 1975 నుంచి 1985 వరకు పీపుల్స్‌వార్ పార్టీలో పని చేశారు. తర్వాత అనారోగ్య కారణాలతో లొంగిపోయి గ్రామంలో భార్య, బిడ్డతో కలిసి ఉంటున్నాడు. కొడుకు ఉన్నా మూడేండ్ల కింద చనిపోయాడు.
ఊర్లోనే సాయిలు అన్న, వారి కుటుంబీకులు కూడా నివాసముంటున్నారు. సాయిలు కుటుంబానికి, మరో దళిత ఫ్యామిలీకి భూవివాదం తలెత్తగా పదిహేను రోజుల కింద ఈ విషయంలో కుల పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించారు. వేరేవారికి అనుకూలంగా తీర్పు చెప్పగా ఇది అన్యాయమంటూ సాయిలు, అతడి అన్న వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహించిన పెద్దలు వారిని కులం నుంచి బహిష్కరించారు. కులంలోని వారు ఎవరు సాయిలు కుటుంబంతో మాట్లాడినా, వారింటికి వెళ్లినా రూ. 5 వేల ఫైన్ వేస్తామని హెచ్చరించారు.
ఉరిలో 50 నుంచి 60 దళిత కుటుంబాలుండగా, అందరూ సాయిలు, ఇతడి అన్న కుటుంబీకులతో మాట్లాడడం, సహకరించడం మానేశారు. మంగళవారం సాయిలు అనారోగ్యంతో చనిపోగా వారింటికి వెళ్లడానికి ఒక్కరు కూడా సాహసించలేదు. శవయాత్రంలో డప్పులు కొట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో చెల్లాపూర్ నుంచి తీసుకురావాల్సి వచ్చింది. దీని గురించి ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి సదరు కులస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్స్వగ్రామం ఇదే కావడం గమనార్హం.