ఆదిలాబాద్ లో క్యాంపు రాజకీయాలు 

  •  రేపే బల్దియా వైస్ చైర్మన్​పై  అవిశ్వాస తీర్మానం
  • క్యాంపునకు తరలిన అన్ని పార్టీల కౌన్సిలర్లు 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నేత జహీర్ రంజానీపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాసంపై రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో అధికారులు ఈనెల 18న అవిశ్వాసం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అవిశ్వాసం వాయిదా వేయలంటూ వారంరోజుల క్రితం జహీర్ రంజానీ హైకోర్టులో పీల్ దాఖలు చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కలెక్టర్​కు ఇచ్చిన అవిశ్వాసం తీర్మానంపై ఆయన సందేహాలను వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినప్పటికీ.. అవిశ్వాసానికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు షురూ చేశాయి. తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించాయి. కాంగ్రెస్ కౌన్సిలర్లను కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాభావన్ నుంచి రెండు కార్లలో క్యాంపునకు తరలించారు. వీరందరూ 18న జరిగే అవిశ్వాస సమావేశానికి నేరుగా చేరుకునేలా ప్లాన్ 
రూపొందించారు. 

34 మంది చేతులు ఎత్తితేనే..

మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వివిధ పార్టీల కౌన్సిలర్ల చేరికలతో కాంగ్రెస్ లో 17 మంది ఉండగా, బీఆర్ఎస్ లో 20 మంది, బీజేపీలో 9, ఎంఐఎం నుంచి ముగ్గురు ఉన్నారు. అవిశ్వాసం కోసం 25 మంది నోటీసులు ఇస్తే సరిపోతుంది. కానీ 34 మంది మద్దతిస్తేనే అవిశ్వాసం నెగ్గుతుంది. ప్రస్తుతానికి అవిశ్వాసానికి అవసరమైన మెజార్టీ బీఆర్ఎస్​కు లేదు.

కానీ ఆ పార్టీకి మద్దతిచ్చేందుకే బీజేపీ మొగ్గు చూపుతుండటంతో అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. అవిశ్వాస సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్డీవో, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ మంగళవారం పరిశీలించారు.‌‌ బల్దియా కార్యాలయంలో జరగబోయే సమావేశ మందిరాన్ని పరిశీలించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు.