కేంద్ర బడ్జెట్ లో సీసీఐ ఊసేలేదు

  • కేంద్రం మరోసారి ప్రజలను మోసం చేసిందని విమర్శలు

ఆదిలాబాద్, వెలుగు :కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ఉమ్మడి జిల్లాకు   అన్యాయం చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం పార్లమెంట్ లో   ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు మొండి చేయిచూపించారు. ఎన్నో ఆశలతో భారీ పరిశ్రమలకు నిధులు వస్తుందని ఎదురుచూసినప్పటికీ కేంద్ర బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో ప్రజలు   నిరాశకు గురయ్యారు.    

ఆదిలాబాద్ లో మూతపడిన సీసీఐ పరిశ్రమకు  నిధులు వస్తాయని స్థానిక ప్రజలు ఆశించారు. కానీ,  బడ్జెట్​లో వాటి  ఊసే లేకపోవడంతో  ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు. మరోపక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్​పోర్ట్​  నిర్మాణాన్ని సైతం తాజా బడ్జెట్లో పట్టించుకోలేదు.  కేంద్ర పద్దుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ(ఎం) తదితర పార్టీల నాయకులు మండిపడుతున్నారు. 

  • సీసీఐపై ఆశలు గల్లంతు..

ఆదిలాబాద్ ప్రాంతానికి తలమానికంగా ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మూతపడి ఏండ్లు గడుస్తోంది. ఈ పరిశ్రమను తెరిపించాలని ఆందోళనలు కూడా జరిగాయి. ప్రజాప్రతినిధులు సైతం ఈ పరిశ్రమను తెరిపించే విషయమై పలుమార్లు కేంద్రమంత్రులను కలిశారు. ఇటీవలే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ భాబు సైతం సీసీఐ పరిశ్రమపై కేంద్ర మంత్రులను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. తాజా బడ్జెట్లో పరిశ్రమ పున ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశగా ఎదురుచూశారు.

ఈ పరిశ్రమ పునరద్దరిస్తే వందల మందికి ఉపాధితో పాటు వందేళ్ల సరిపడ ముడిసరుకు ఉండటంతో పరిశ్రమ లాభాలు తెచ్చిపెడుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. కానీ కేంద్రప్రభుత్వం నేతల వినతిని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడుతున్నారు.   జిల్లా కేంద్రంలో విమానయోగం ఉంటుందని అందరూ ఆశపడ్డారు. ఇక్కడ వైమానికదళ శిక్షణ కేంద్రం ఏర్పాటుచేస్తారనే ప్రచారం ఉంది. ఇందుకు భూసేకరణ కోసం గతంలో రూ.438 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపించారు. కానీ తాజా బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు చోటు దక్కలేదు.