సమస్యలుంటే రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

  • మా దృష్టికి తీసుకురండి: కలెక్టర్​

నిర్మల్/లోకేశ్వరం, వెలుగు: ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను గురువారం ఆమె సందర్శించారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తీసుకెళ్లిన తర్వాత రైస్ మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే రైతులు వారి వద్దకు వెళ్లవద్దని సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

తామే అధికారులను అక్కడికి పంపి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ఈనెల 18 సాయంత్రం లోపు కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులను సరఫరా చేస్తామని, 20 తేదీ లోపు కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పునరావాస గ్రామ సమస్యలు పరిష్కరించాలి

తమ గ్రామానికి అధికారులు ఇంతవరకు గ్రామ కంఠం ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వ అవసరాల కోసం భూమి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అబ్దుల్లాపూర్​గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొనుగోలు కేంద్రాలు, తదితర అవసరాల కోసం గ్రామస్తులమంతా డబ్బులు పోగు చేసి భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు.

దీంతో వీలైనంత త్వరలో స ర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, డీఆర్​డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ మేనేజర్ గోపాల్, తహసీల్దార్ మోతిరాం పాల్గొన్నారు.