ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్​తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరి కొనుగోలు ప్రక్రియను స్పీడప్​చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

ప్యాడీ క్లీనర్ల ద్వారా ధాన్యాన్ని శుభ్రం చేసి అమ్మేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనింగ్, తూకం, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.  అనంతరం రైస్ మిల్లర్లతో మాట్లాడుతూ తరుగు పేరుతో రైతుల నుంచి అధిక ధాన్యాన్ని సేకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది పెట్టొద్దన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సమావేశంలో డఎస్ వో కిరణ్ కుమార్, డీఎం వేణుగోపాల్, డీసీవో రాజమల్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.