ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్

  • గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ అభిలాష అభినవ్

నెట్​వర్క్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, డ్రైనేజీల్లో యాంటీ లార్వా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డీఆర్ఓ భుజంగ్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులుసమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్ తెలిపారు. కలెక్టరేట్ భవనంలో బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 54 దరఖాస్తులు అందాయని తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల విభాగానికి వినతుల వెల్లువ

ఆదిలాబాద్ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని ఆయా మండలాల నుంచి 156 మంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్​కు అర్జీలు అందజేశారు. వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్రూం ఇండ్లు, సదరం సర్టిఫికెట్, రహదారుల ఏర్పాటు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్, గాది గూడలో మీ సేవా మంజూరు కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​ ఆదేశించారు. అడిషనల్​కలెక్టర్ శ్యామలా దేవి, జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు.

అర్జీదారులు చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఆర్డీఓ లు లోకేశ్వరరావు, కాసబోయిన సురేశ్​తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, తన భర్త పేరిట ఉన్న అటవీ హక్కు పత్రాన్ని తన పేరిట మార్చాలని, భూమిని ఆన్ లైన్ లో నమోదు చేసి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని తదితర అంశాలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.