పెంబి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : అభిలాష అభినవ్

పెంబి, వెలుగు: సంపూర్ణత అభియాన్ లో భాగంగా పెంబి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం పెంబి మండల కేంద్రంలో నీతి ఆయోగ్ ప్రతిపాదిత ఆస్పిరేషనల్ బ్లాక్ లో భాగంగా ఆయన సంపూర్ణతా అభియాన్ కార్యక్రమాన్ని అడిషనల్​కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నీతి అయోగ్ ప్రత్యేక అధికారి సుమోదా కపూర్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా పెంబిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులు, స్థానిక ప్రజలతో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన, మారుమూల 500 మండలాలను నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ లుగా ఎంపికచేసి, వాటి అభివృద్ధికి చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా పెంబి మండల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అంతకుముందు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ట్రిబుల్​ఐటీ బాసరలో ప్రవేశాలు పొందిన ఐదుగురు విద్యార్థులను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో రవీందర్ రెడ్డి, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్ వో ధన్ రాజ్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.