పెంబి, వెలుగు: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పెంబి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన శ్రీవెంకటసాయి రైతు ఉత్పత్తిదారుల సంస్థను కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లా డారు.
పెంబి మండలంలోని 350 మంది రైతులు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సంస్థకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు రైతుల అభివృద్ధికి వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. సంస్థలో మహిళా రైతుల భాగస్వామ్యాన్ని పెంచేలా కృషి చేయాలని నిర్వాహకులను కోరారు.
సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలను ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. నిర్మల్ డీఆర్డీఓ విజయ లక్ష్మి, నాబార్డ్ డీడీ వీరభద్రుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, అధికారులు, నాయకులు
పాల్గొన్నారు.