సర్వేను సమర్థంగా పూర్తిచేయాలి

లక్ష్మణచాంద, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వేను లోటుపాట్లు లేకుండా పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచాంద మండలం పీచరలో నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా గృహ జాబితా నమోదు ప్రక్రియ తీరును అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్​తో కలిసి పరిశీలించారు. తమకు కేటాయించిన సర్వే విధులను ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వహించాలన్నారు. నిర్ణీత సమయంలో సర్వేను పూర్తిచేయాలన్నారు. అంతకుముందు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 

కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. పీచర జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్, పొట్టపల్లిలోని వ్యవసాయ గోదాంను పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీపీవో జీవరత్నం, సివిల్ సప్లయీస్ డీఎం వేణుగోపాల్, డీఎస్ వో కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

అన్ని వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి

కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో కుటుంబసభ్యుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అధికారులను ఆదేశిం చారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో కలిసి పరిశీలించారు. ఎన్యుమరేటర్లు, సూపర్​ వైజర్లు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో పని చేసి సకాలంలో సర్వేను పూర్తిచేయాలన్నారు.