తప్పుల్లేకుండా వివరాలు నమోదు చేయాలి

నిర్మల్/ఆదిలాబాద్ టౌన్/ ఆసిఫాబాద్​/కాగజ్ నగర్, వెలుగు: ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పిదాలకు తావులేకుండా  సమాచారం సేకరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వెంకటాద్రిపేట్ వార్డు నెంబర్ 6లో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాల్లో ఆయా కోడ్​ల వారీగా వివరాలు న మోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.

 ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో నమోదు చేసేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. డీఆర్ఓ రత్నకల్యాణి, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్​జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. బోథ్ మండల కేంద్రంతో పాటు కౌట‘బి’ గ్రామంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవా లని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శుభాష్ చందర్, ప్రత్యేక అధికారి జావిద్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఎంపీడీవో రమేశ్ 

తదితరులున్నారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లిలో సాగుతున్న సర్వేను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. తమకు కేటాయించిన బ్లాక్​లలో కుటుంబ సభ్యుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు సూచించారు.

సర్వేలో నిర్లక్ష్యం వద్దు

 ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో ప్రతీ ఒక్కరి వివరాలు నమోదు చేయాలని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం చేయవద్దని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కాగజ్ నగర్​లోని కాపువాడలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. తప్పుల్లేకుండా సర్వేను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. తహసీల్దార్ కిరణ్, మున్సిపల్ ఆర్ఐ క్రాంతి పాల్గొన్నారు.