- వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
బాసర, వెలుగు: ఆర్జేయూకేటీని అన్ని రంగాల్లో ముందుంచుతానని కొత్త వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం ఉదయం బాసర ట్రిపుల్ఐటీ ప్రాంగణానికి చేరుకున్న గోవర్ధన్‌ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి స్వాగతం పలికారు. అనంతరం వర్సిటీ స్థితిగతులపై వీసీ చాంబర్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్స్‌ను పరిశీలించారు. మధ్యాహ్నం స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత పరిపాలన భవనంలో అకడమిక్ అసోసియేట్ డీన్స్, స్టూడెంట్ వెల్ఫేర్ అధికారులతో సమావేశమయ్యారు.
వర్సిటీలో అందిస్తున్న కోర్సుల వివరాలు, అకడమిక్ క్యాలెండర్, వసతి గృహాల వివరాలు, విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న సేవలు తదితర అంశాలను వీసీకి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేలా కొత్త కోర్సుల ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.