పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : నీలం మధు

మెదక్​టౌన్, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేళీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేద రైతులకు అసైన్​మెంట్​భూములు పంచిందని, సొంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చిందని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇళ్ల విషయంలో పేదలను మోసం చేశాయన్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిశాక అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రి అయిన మెదక్ లోక్ సభ స్థానంలో బడుగు బలహీన వర్గానికి చెందిన తనకు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాన్నాన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిందన్నారు. బూర్గుపల్లిలో రూ.57 లక్షలు మంజూరు చేసి స్కూల్​ను తీర్చిదిద్దుతున్నామని హామీ ఇచ్చారు. గెలిచిన మూడు నెలల్లో ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

భావోద్వేగానికి గురైన నీలం మధు

పటాన్​చెరు: మెదక్​పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్​ తరపున పోటీ చేస్తున్న నీలం మధు సోమవారం ఆయన తల్లి దండ్రులు నీలం నిర్మల్, రాధల 3వ వర్ధంతి సందర్భంగా చిట్కుల్​లో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తల్లిదండ్రుల స్మారక విగ్రహాలకు నివాళులర్పిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, నాయకులు, ఎన్ఎంఆర్ సేన, అభిమానులు పాల్గొన్నారు.