అక్రమాలకు రాచబాటగా ఎన్ హెచ్ 65

  • బంగారం, గంజాయి, డ్రగ్స్​ జోరుగా రవాణా
  • దొంగలకు టార్గెట్ గా మారిన ముంబై రోడ్డు
  • పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్న ఇల్లీగల్​దందాలు

సంగారెడ్డి, వెలుగు : అక్రమ రవాణాకు 65వ నేషనల్ హైవే  రాచబాటగా మారింది. ఏపీ, కర్నాటక, మహారాష్ట్రతో సరిహద్దు ఉండడంతో ఇల్లీగల్​దందాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన ఎస్పీ రూపేశ్ పోలీసు అధికారులతో ముమ్మర తనిఖీలు చేయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కలిపే ఈ రహదారిపై రోజూ వేలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ప్రైవేటు వాహనాల్లో అక్రమ రవాణా చేస్తే పోలీసులకు దొరికిపోతామనే భయంతో అక్రమార్కులు ఈ మధ్య కొత్తగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎంచుకుని దందా సాగిస్తున్నారు.

కిలోల కొద్దీ బంగారాన్ని తరలిస్తూ అక్రమ వ్యాపారాలకు తెర తీస్తున్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా ట్రావెల్స్ బస్సుల్లో కోట్లాది రూపాయల విలువచేసే బంగారాన్ని తరలిస్తున్నారు. దీనికి తోడు తరచూ గంజాయి, డ్రగ్స్​పట్టుబడుతూ ఉన్నాయి.

గడిచిన 15 రోజుల్లో..

ముంబై నేషనల్ హైవేపై ఇటీవల పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. గడిచిన15 రోజుల్లో రెండు ఘటనల్లో 7.03 కిలోల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గత నెల 26న చిరాగ్ పల్లి పీఎస్​పరిధిలో మాడిగి వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 2.95 కిలోల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఈ రవాణా గుట్టు బయటపడింది. దీని విలువ రూ 3.10 కోట్లు ఉండగా

దొంగను ఈనెల 5న పోలీసులు పట్టుకుని బంగారాన్ని రికవరీ చేశారు. ఈనెల 6న కంకోల్ టోల్ ప్లాజా వద్ద చంద్రేశ్ అనే వ్యక్తి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఎలాంటి పత్రాలు లేకుండా 4.8 కిలోల బంగారు నగలను తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత రెండు నెలల్లో ఇదే నేషనల్ హైవేపై గంజాయి, అక్రమ మద్యం, డ్రగ్స్​రవాణా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.

నాలుగు చెక్ పోస్టులు

కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి జిల్లాలో మొత్తం 4 చెక్ పోస్టులు ఉన్నాయి. మొగుడంపల్లి మండలం మాడిగి, న్యాల్కల్ మండలం ఊసెల్లి వద్ద ఆర్టీఏ, ఎక్సైజ్ చెక్ పోస్టులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఎస్పీ రూపేశ్ ఆదేశాల మేరకు కొత్తగా నాగల్ గిద్ద మండలం మోర్గి, కంగ్టీ మండలం డేగుల్వాడి వద్ద పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ కు ఆనుకుని ఉన్న మాడిగి చెక్ పోస్టును తప్పించేందుకు అక్రమార్కులు కర్నాటక నుంచి మొగుడంపల్లి మీదుగా రవాణా సాగిస్తున్నారు. అలాగే ఊసెల్లి వద్ద ఉన్న చెక్ పోస్టును తప్పించుకునేందుకు రాయికోడ్ నుంచి గంగువార్ మీదుగా ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ రూట్​లో  కూడా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంటుంది. కర్నాటక, మహారాష్ట్ర నుంచి బంగారం, గంజాయి, డ్రగ్స్​ఏపీకి తరలించడానికి 65వ నేషనల్ హైవేను టార్గెట్ చేసుకొని రవాణా చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.