ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తా : నరేందర్ రెడ్డి

  • ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

నస్పూర్, వెలుగు: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. మంచిర్యాల పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో టీచర్లు, గ్రాడ్యుయేట్లు, సింగరేణి కార్మికులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. అనంతరం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు మరోసారి ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తారని, నమోదు చేసుకోనివారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైతే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, జాబ్ క్యాలెండర్ ద్వారా ఎక్కువ ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తానన్నారు. గని కార్మికుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని చెప్పారు. ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా నాయకులు రేగళ్ల ఉపేందర్, శ్యాంసుందర్ రెడ్డి, జుల్ఫేఖర్, మైదం రామకృష్ణ, ఉట్ల సత్యనారాయణ, మమత, మానస తదితరులు పాల్గొన్నారు.