వైభవంగా నల్లపోచమ్మకు బండ్ల ఊరేగింపు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో ఆదివారం నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి యేడు మృగశిర కార్తెలో అమ్మవారికి బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్దంగా అలంకరించిన బండ్లను పట్టణంలోని నవాపేట, పెద్దబజార్​, పిట్లంబేస్​, ఫతేనగర్​, చమన్​ వీధుల నుంచి తీసుకొచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ తిప్పారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు లింగారెడ్డి, మల్లారెడ్డి, రామ్​రెడ్డి, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సీఐ దిలీప్ కుమార్, ఎస్ఐ పోచయ్య, రుక్సానా బేగం అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

ఘనంగా పోచమ్మ బోనాలు

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తిమ్మాయ పల్లెలో కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మకు  బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పాడి పంటలు, వర్షాలు సమృద్ధిగా కురవాలని, గ్రామస్తులు సుఖ సంతోషాల తో జీవించాలని పోచమ్మ తల్లిని కోరారు.