ఎంఫ్​లకు నిధుల వరద..ఈ ఏడాదిలో రూ.17 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : మ్యూచువల్​ ఫండ్ ​ ఇండస్ట్రీ గత ఏడాది మాదిరే 2024లోనూ దూసుకెళ్లింది. మ్యూచువల్​ ఫండ్ల ఆస్తుల విలువ ప్రస్తుత సంవత్సరంలో రూ.17 లక్షల కోట్లు పెరిగింది. ఈక్విటీ మార్కెట్లలో జోష్​, ఎకనమిక్ ​గ్రోత్​ బాగుండటం, ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం ఇందుకు కారణాలు. రాబోయే సంవత్సరంలో ఎంఎఫ్​ల ఆస్తులు భారీగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయని మార్నింగ్​స్టార్​ ఇన్వెస్ట్​మెంట్​రీసెర్చ్​ డైరెక్టర్​ కౌస్తుభ్ ​బేలాపూర్కర్​ చెప్పారు.

ఈక్విటీ ఫండ్స్​లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ముఖ్యంగా సిస్టమాటిక్​ఇన్వెస్ట్​మెంట్​ప్లాన్స్​(సిప్​లు)​ ద్వారా   నిధులు ఎక్కువగా అందుతున్నాయని వివరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటిలో సిప్​ల వాటా రూ.2.4 లక్షల కోట్లు ఉందని అన్నారు. గత నెల నాటికి మ్యూచువల్​ఫండ్స్​అసెట్​అండర్​మేనేజ్​మెంట్​(ఏయూఎం) విలువ రూ.68 లక్షల కోట్లకు చేరింది.

గత ఏడాదితో పోలిస్తే వీటి విలువ 27 శాతం పెరిగింది. గత  నాలుగేళ్లలో ఏయూఎం రూ.30 లక్షల కోట్లు పెరిగిందని అసోసియేషన్​ ఆఫ్​ మ్యూచువల్​ ఫండ్ ఇండస్ట్రీ (యాంఫీ) వెల్లడించింది.