అధికారుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే : పవర్ రామారావు పటేల్

కుభీర్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అధికారులను హెచ్చరించారు. కుభీర్​మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. వ్యవసాయ శాఖ మండల అధికారి వికర్ హైమద్ మాట్లాడుతుండగా.. కొందరు రైతులు కల్పించుకొని మాట్లాడారు. ఏఈఓలు ఇష్టారీతిలో పంట నమోదు చేయడం వల్ల నష్టపోతున్నామని వాపోయారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నమోదు చేయాలని కోరారు. 

ఏఈఓలు చేసిన తప్పిదం వల్ల రబీ సీజన్​లో జొన్న పంటను చాలా మంది దళారులు మహారాష్ట్ర నుంచి తెచ్చి మన మార్కెట్​లో అమ్మినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ ఏఈ సమావేశానికి హాజరు కాకుండా కిందిస్థాయి అధికారిని పంపడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఈకి నోటీస్ పంపాలని ఎంపీడీఓ మోహన్ సింగ్​ను ఆదేశించారు. పలు అంశాలపై చర్చించారు. ఆపై సీఎం రిలీఫ్ ఫండ్​ చెక్కులు పంపిణీ చేశారు. సమావేశంలో అధికారులు, నేతలు పాల్గొన్నారు.