ఈ ప్రిన్సిపాల్ ​మాకొద్దు అంటూ .. పీఎస్​ ముందు స్టూడెంట్స్​ బైఠాయింపు

  • వసతులపై ప్రశ్నిస్తే టార్గెట్​చేస్తోందని ఆరోపణ
  • సస్పెండ్​ చేయాలని డిమాండ్​
  • ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలో ఘటన 

ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రం మావలలో ఉన్న మహాత్మ జ్యోతిబా ఫూలే రెసిడెన్సియల్(​ జైనథ్) స్కూల్ ప్రిన్సిపాల్​  సంగీతపై చర్యలు తీసుకోవాలని ఆ బడి విద్యార్థులు గురువారం టూటౌన్​ పోలీస్​స్టేషన్​ ముందు బైఠాయించారు.  ప్రిన్సిపాల్ తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని, లేకపోతే  తాము స్కూల్ కు వెళ్లబోమని భీష్మించుకు కూర్చున్నారు. 

వసతులపై ప్రశ్నిస్తే తమను టార్గెట్ చేస్తోందని  ఆరోపించారు. ‘మీరు ఎవరికైనా ఫిర్యాదు చేస్కోండి..మీ టీసీలో బ్యాడ్​ రిమార్క్​ రాస్తా’ అంటూ తమను బ్లాక్​మెయిల్​ చేస్తున్నారని చెప్పారు. నిలదీసిన ఒక విద్యార్థికి ఇప్పటికే టీసీ ఇచ్చి పంపించిందని తెలిపారు. దీంతో సీఐ కరుణాకర్ ​అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని విద్యార్థులకు సర్ది చెప్పగా వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు స్కూల్​కు వెళ్లి విచారణ జరిపినట్టు తెలిసింది.