ఆస్తి, డబ్బుల కోసం హత్యలు ఒకచోట కొడుకు..మరోచోట తల్లి

  •     ఆస్తి, డబ్బుల కోసం ఘాతుకాలు
  •     బెల్లంపల్లిలో కొడుకు పోరు పడలేక మర్డర్​ 
  •     లోకేశ్వరంలో డబ్బుల కోసం తల్లిని కడతేర్చిన తనయుడు 
  •     ఉమ్మడి ఆదిలాబాద్​లో ఘటనలు 

బెల్లంపల్లి, వెలుగు : ఆస్తి తగాదాలు రక్త సంబంధీకుల ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో అయినవారని కూడా చూడకుండా చంపేస్తున్నారు.  ఇలాంటి రెండు ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో జరిగాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లిలో ఆస్తి పంచివ్వాలని గొడవ పెట్టుకున్న కొడుకును తండ్రి హత్య చేయగా, నిర్మల్ ​జిల్లా లోకేశ్వరం మండలంలో కూలీ పని చేసుకుని బతికే తల్లిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో కొడుకు ఆమెను కడతేర్చాడు. బెల్లంపల్లి రూరల్ ఇన్​స్పెక్టర్​ అఫ్జలొద్దీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవ మారాలు, -భీరక్కకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు దేవ వినోద్(30) ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని కొద్ది రోజులుగా తండ్రితో గొడవ పడుతున్నాడు.

సోమ వారం ఉదయం మళ్లీ తండ్రితో గొడవ పడగా.. తల్లి పెద్దమనుషులతో మాట్లాడుదామని సర్ది చెప్పింది. తర్వాత పొలం పనికి వెళ్లిన మారాలు ఉదయం ఇంటికి  రాగా..వినోద్ మరోసారి తండ్రిని బూతులు తిడుతూ  ఆస్తి పంచాలని గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మారాలు ఇంట్లో ఉన్న పారతో కొడుకు మెడ, తలపై దాడి చేశాడు. మంచంపైనే కుప్పకూలిన వినోద్​ను తల్లి, తమ్ముడు బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించగా చనిపోయాడు. సంఘటనా స్థలాన్ని సీఐ అఫ్జలొద్దీన్, తాళ్ళగురిజాల ఎస్సై జి.నరేశ్​ పరిశీలించారు. 

డబ్బులివ్వడం లేదని తల్లిని..

లోకేశ్వరం : నిర్మల్​జిల్లా లోకేశ్వరం మండలం లక్ష్మీ నగర్ తండాకు చెందిన లావుడియా ఇందిరాబాయి (60) భర్త కొద్దికాలం క్రితం చనిపోగా కొడుకు రాయబాబు(28), కోడలితో కలిసి జీవిస్తోంది. పెద్ద కొడుకు శివయ్య కుటుంబంతో పాటు బోరిగాంలో ఉంటున్నాడు.  ఇందిరాబాయి కూలీనాలీ చేసుకొని సంపాదించుకునే డబ్బులను ఇవ్వాలని రాయబాబు తల్లిని వేధించేవాడు. సోమవారం కూడా తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది.

దీంతో ఆగ్రహంతో రాయబాబు  ఇంట్లో ఉన్న కొడవలితో తల్లి కడుపులో పొడిచాడు. దీంతో ఇందిరాబాయి చనిపోయింది.  భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, ముథోల్ సీఐ మల్లేశ్, ఏఎస్ఐ దిగంబర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముథోల్ సీఐ తెలిపారు.