- పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన యువకుడు
- ఆర్థిక విభేదాల కారణం
రామాయంపేట, వెలుగు : డబ్బుల గొడవ కారణంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజుపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. పట్టణానికి చెందిన పోచమ్మల గణేశ్ అనే వ్యక్తి అతడి తల్లి పేరున ఉన్న ఎకరం భూమి డెవలప్‌మెంట్ కోసం నాగరాజుతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. పెద్దల సమక్షంలో మాట్లాడుకునేందుకు శనివారం పెద్దమ్మ ఆలయం వద్ద కూర్చుకున్నారు. ఈ టైంలో గణేశ్ నాగరాజుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు.
అక్కడ ఉన్న వారు అడ్డుకొని పోలీసులను సమాచారం ఇచ్చారు. నాగరాజు ఫిర్యాదుతో గణేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్ చెప్పారు. కాగా బీఆర్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజుపై జరిగిన హత్యాయత్నాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో ఖండించారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నాగరాజును హత్య చేసేందుకు యత్నించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.