హుస్నాబాద్, వెలుగు: పబ్లిక్ ప్లేసులు, రోడ్లపైన, ఇండ్ల పరిసరాల్లో చెత్త వేస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం జరిమానా విధిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ రజిత హెచ్చరించారు. తడి, పొడిచెత్తను వేరుచేయకపోతే చర్యలు తీసుకోవడమే కాకుండా, పారిశుధ్య సిబ్బంది ఆ చెత్తను తీసుకోబోరన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె హుస్నాబాద్‌లోని 15వ వార్డులో యూబీఆర్ బేసిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తడి, పొడి, హానికరమైనచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇంటింటికీ తిరుగుతూ చెత్త విభజన ఎలా చేయాలో తెలిపే కరపత్రాలను ఇచ్చారు. గ్రీన్ రంగు డబ్బాలో తడి చెత్త, బ్లూ రంగు డబ్బాలో పొడి చెత్తను వేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ చెత్తను ఇండ్ల పరిసరాలు, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో పారవేయవద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అనిత, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్ హరీశ్, కో ఆప్షన్ మెంబర్లు శంకర్‌రెడ్డి, ఆయుబ్, శానిటరీ ఇన్స్పెక్టర్, బాల ఎల్లం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రవికుమార్, వార్డు ఆఫీసర్ సాంబరాజు, బేసిల్ ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్, సూపర్వైజర్ నవీన్ పాల్గొన్నారు.