గొడవకు బాధ్యులైన ఎవరినీ ఉపేక్షించం : రంగనాథ్

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో గొడవలు, దాడులకు కారణమైన ఎవరినీ ఉపేక్షించేది లేదని మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇరువర్గాల ఘర్షణ, పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పరిస్థితి సమీక్షించేందుకు  శనివారం రాత్రి ఆయన మెదక్ పట్టణానికి చేరుకున్నారు. టౌన్ పీఎస్​లో ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహేందర్ ను జరిగిన సంఘటనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ లో పరిస్థితి అదుపులో ఉందన్నారు. ముందు జాగ్రత్తగా పక్క జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నామని చెప్పారు. టౌన్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 

మెదక్ లో దాడులు, ఉద్రిక్తత నెలకొనడానికి కారకులెవరనేది గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులు ఏ వర్గానికి చెందిన వారైనా చర్యలు తప్పవన్నారు. ఏదైనా తప్పు జరుగుతున్నట్టు తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి కానీ, మెదక్ లో కొందరు అందుకు విరుద్ధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టు తెలిసిందన్నారు. వారు గుంపులు గుంపులుగా తిరిగి షాప్స్ పై దాడులు చేసి ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. కాగా జరిగిన సంఘటనల్లో పోలీసుల తప్పిదం, పొరపాట్లు ఏమైనా ఉన్నట్టు తేలితే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.