రెచ్చిపోతున్న మట్టి మాఫియా..విచ్చల విడిగా చెరువుల్లో తవ్వకాలు

  • హైదరాబాద్​ తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
  • పట్టించుకోని ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులు

శివ్వంపేట, వెలుగు: మెదక్​జిల్లా శివ్వంపేట మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువుల నుంచి అడ్డూ అదుపు లేకుండా మట్టి తరలిస్తున్నారు. జేసీబీలతో తవ్వి టిప్పర్లతో హైదరాబాద్  తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  అనుమతులు లేకుండా చెరువుల్లో ఇష్టా రీతిగా మట్టి తవ్వుతూ పంట కాల్వలు, తూములు ధ్వంసం చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.  పద్ధతి లేకుండా మట్టి తవ్వకంతో చెరువుల్లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. 

మండల పరిధిలోని చిన్నగొట్టి ముక్కుల బయాన చెరువు, గూడూరు నాగయ్య చెరువులో నుంచి రాత్రి వేళల్లో పెద్ద పెద్ద హిటాచీలతో మట్టిని తవ్వుతూ టిప్పర్లల్లో  తరలిస్తున్నారు. ఇటుక బట్టీలకు, వెంచర్లకు అమ్ముకుంటున్నారు. గత వారం రోజులుగా వందలాది ట్రిప్పుల మట్టి తరలిపోతోంది. చెరువు తూములను, కాల్వలను తవ్వేస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు మిన్నకుండడంపై రైతులు మండిపడుతున్నారు. గ్రామస్తులు మట్టి తరలింపును అడ్డుకొని ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేగాక మట్టిని తరలిస్తున్నారంటూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే వారు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వారి పేర్లను మట్టి మాఫియాకు చెప్పడంతో వారు యువకులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. 

హిటాచీలతో చెరువుల్లో పెద్దపెద్ద గుంతలు తీయడం వల్ల వర్షాకాలంలో చెరువులు నిండిన తర్వాత పశువులు, మనుషులు ఆ గుంతల్లో పడి చనిపోతున్నారు. అంతేగాక మట్టి తరలించే టిప్పర్లు స్పీడ్​గా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో టిప్పర్లు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. కలెక్టర్ స్పందించి అక్రమమట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.

పరిశీలిస్తాం

మండలంలోని చెరువుల్లో నుంచి మట్టి తరలింపు అంశాన్ని పరిశీలిస్తాం. ఎవరి దగ్గర అయినా పక్కా ఆధారాలు ఉంటే ఇవ్వాలి. వారిపైన కేసులు నమోదు చేస్తాం. 
- సునీత, ఇరిగేషన్​, ఏఈ

ఇరిగేషన్​ వాళ్లు చూస్తారు

చెరువులు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ పరిధిలో ఉంటాయి. వాటిలో నుంచి మట్టి తరలిస్తే ఇరిగేషన్ వాళ్లు చర్యలు తీసుకోవాలి. అయినా మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రిబుల్​ ఆర్​రోడ్డు సర్వే అయిన భూముల్లో నుంచి తరలిస్తే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.  
- శ్రీనివాస్​ చారి, తహసీల్దార్