ఎస్సీ వర్గీకరణ హామీని నిలబెట్టుకోవాలి

మంచిర్యాల/ఆదిలాబాద్ టౌన్, వెలుగు : సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్​ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల పట్టణ కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాలలో కలెక్టరేట్​ను ముట్టడించిన అనంతరం కలెక్టర్​కుమార్ ​దీపక్​కు మెమోరాండం అందజేశారు. 

ఆదిలాబాద్​కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆఫీస్ గేట్​కు వినతిపత్రం తగిలేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని, గతంలో ఇచ్చిన జాబ్​ నోటిఫికేషన్లలో కూడా రిజర్వేషన్​అమలయ్యేలా ఆర్డినెన్స్ తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ రిజర్వేషన్​అమలు 

చేయకుండానే డీఎస్సీ 2024 ద్వారా ఎంపిక చేసిన 11,062 మంది టీచర్లకు అపాయింట్​మెంట్​ లెటర్లు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్లు సంబరాలు చేసుకుంటే వర్గీకరణ లేకుండా ఉద్యోగం కోల్పోయిన మాదిగలు మాత్రం బాధపడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వర్గీకరణ తొందరగా అమలు చేయాలని కోరారు. మంచిర్యాలలో జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, నాయకులు కల్వల శరత్, మురళీకృష్ణ, మంత్రి మల్లేశ్​, చెన్నూరి శ్రీనివాస్

చుంచు శంకర్ వర్మ, జలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదిలాబాద్​లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ మాదిగ, నాయకులు కంబ్లె బాలాజీ, బెడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు పసుల రాజు, మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చందల రాజన్న, ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.