సమగ్ర సర్వే దేశానికే రోల్​మోడల్: ఎంపీ వంశీకృష్ణ

 

  • కులగణనతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం: ఎంపీ వంశీకృష్ణ
  • అధికారులకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి
  • గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ఫైర్

మంచిర్యాల/కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్/ పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే దేశానికే రోల్ మోడల్​గా నిలుస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కులగణనతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి ఐదేండ్లకోసారి జనగణన, పదేండ్లకోసారి కుల గణన చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కుల గణనపై డీసీసీ చైర్మన్ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్​లో కుల సంఘాల సమావేశం జరిగింది. దీనికి ఎంపీ వంశీకృష్ణ చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. కులగణనతో ఆయా సామాజిక వర్గాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్యూమరేటర్లకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్ రావు, అధికారులు పాల్గొన్నారు.

పోస్టాఫీస్​కు పర్మినెంట్ భవనం

మందమర్రిలో పోస్టాఫీస్ శిథిలావస్థకు చేరుకుందని, కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. కళ్యాణిఖని పోస్టాఫీసును ఆయన శనివారం పరిశీలించారు. 73 ఏండ్లుగా సింగరేణి కంపెనీకి చెందిన క్వార్టర్​లో పోస్టాఫీస్ నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయని ఉద్యోగులు, సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మందమర్రి రైల్వే స్టేషన్​లో టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని కోరగా.. సంబంధిత రైల్వే ఆఫీసర్లను ఆదేశిస్తానని తెలిపారు. కాగా.. మంచిర్యాలకు వెళ్తూ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్​లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్​ఠాకూర్​తో ఎంపీ భేటీ అయ్యారు. 

స్టూడెంట్లు చనిపోవడం బాధాకరం

గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు స్టూడెంట్లు చనిపోవడం బాధాకరమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నెపల్లి గ్రామానికి చెందిన దాసరి సాయి, కొండ అరుణ్ అశ్విత్, మరికొంత మంది ఫ్రెండ్స్​తో కలిసి శుక్రవారం అన్నారం బ్యారేజీ సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు సాయి, అరుణ్ నీట మునిగి చనిపోయారు. రెండు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దుగ్నెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మల్లేశ్ తల్లి లచ్చక్క, జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన కార్యకర్త పోతుగంటి సుమన్ తండ్రి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఇరువురి కుటుంబ సభ్యులను ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు.