దుబ్బాక, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, మెదక్ పార్లమెంట్ పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను కైవసం చేసుకుని బీజేపీ సత్తా చాటాలని ఎంపీ రఘునందన్‌రావు పిలుపు నిచ్చారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గ స్థాయి బీజేపీ ఓటరు మహాశయుల కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయకుడు జనంలో ఉండాలని, లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తనంతట అదే వస్తుందన్నారు. వార్డు సభ్యుల నుంచి మొదలు పార్లమెంట్ మెంబర్వరకు బీజేపీ కార్యకర్తలే ఉండాలని ఆకాంక్షించారు.
నవ్విన చోటనే గెలిచి చూపించాలన్నారు. జనమెప్పుడు డబ్బులకు అమ్ముడు పోరని ఉప ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లోనే రుజువైందన్నారు. డబ్బుల సంచులతో వచ్చిన ట్రబుల్ షూటర్ కుకర్రు కాల్చి వాత పెట్టారన్నారు. సిద్దిపేట, దుబ్బాక తనకు జన్మనిస్తే పెంచి పోషించిన పఠాన్ చెరు, సంగారెడ్డి ప్రాంతాలు కర్మ భూమిగా ఆశీర్వదించాయని, తనను అక్కున చేర్చుకుని మంచి మెజార్టీతో గెలిపించిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అంతకుముందు స్థానిక బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మశాలి సంఘ సభ్యులు ఎంపీని ఘనంగా సన్మానించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కేసిఆర్‌దే
గజ్వేల్ : రాజ్యాంగం గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్టణంలో ఏర్పాటు చేసిన బీజేపీ కృతజ్ఞత సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు కండువా ఎట్లా కప్పుతారని కేటీఆర్అడుగుతున్నడని, సైకిల్‌గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను
తీసుకుని కారుగుర్తు క్యాబినేట్లో మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్కాదా అని ప్రశ్నించారు. గతంలో మీరు ఏంచేశారో ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే చేస్తన్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు గురువారెడ్డి, శ్రీనివాస్, రామ్మోహన్‌గౌడ్ పాల్గొన్నారు.