తప్పు చేసినోళ్లు సీఎంకు కనిపించడం లేదా...రఘునందన్‌‌రావు

సిద్దిపేట, వెలుగు :  కాళేశ్వరంలో తప్పు చేసినోళ్లు, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేసినోళ్లు సీఎం రేవంత్‌‌రెడ్డికి కనిపించడం లేదా అని మెదక్‌‌ ఎంపీ రఘునందన్‌‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్‌‌ ఆర్డర్‌‌ క్షీణిస్తోందని సుల్తానాబాద్‌‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటనే ఇందుకు నిదర్శనం అన్నారు. ఈ విషయంపై స్పందించాల్సిన మంత్రులు విజయవాడ నుంచి తెప్పించిన లాండ్‌‌ క్రూజర్లలో తిరుగుతూ ఎంజాయ్‌‌ చేస్తున్నారని మండిపడ్డారు.

పార్లమెంట్‌‌ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుస్తామన్న సీఎం రేవంత్‌‌రెడ్డి... ఆయన సిట్టింగ్‌‌ స్థానమైన మల్కాజ్‌‌గిరి, సొంత నియోజకవర్గమైన మహబూబ్‌‌నగర్‌‌, ఇన్‌‌చార్జిగా ఉన్న చేవేళ్లలో బీజెపీ గెలిచిన విషయం మరవొద్దన్నారు. గజ్వేల్‌‌ నియోజకవర్గంలోని క్షీరసాగర్‌‌లో మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బినామీ కంపెనీలు ఆక్రమించుకున్న అసైన్డ్‌‌ భూములను 30 రోజుల్లో విడిపిస్తానని స్పష్టం చేశారు. 

రేవంత్‌‌రెడ్డికి నిజాయితీ ఉంటే వెంకట్రామిరెడ్డి ఆక్రమించిన భూములపై విచారణ జరపాలన్నారు. వెంకటరామిరెడ్డికి చెందిన రాజపుష్ప కంపెనీ నుంచి బీఆర్‌‌ఎస్‌‌ కోసం డబ్బులు తీసుకుపోయినట్లు పోలీస్‌‌ ఆఫీసర్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. సిద్దిపేటకు హరీశ్‌‌రావు స్థానికుడు కాదని, ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారనే తన సొంత గ్రామమైన బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపారని అన్నారు.